విశాఖపట్నం, అక్టోబర్ 23: బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పి ఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకంనకు సంబంధించిన వివరాలను అధికారుల నుండి జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ మరియు క్వాంటిటీ లలో అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు, హెడ్మాస్టర్లు ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారము విద్యార్థులకు భోజనం అందిస్తున్నది లేనిది తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. వైద్యాధికారులు స్కూల్స్ ని తనిఖీ చేసి విద్యార్థులకు అవసరమైన ఐరన్ టాబ్లెట్స్ తో పాటు అవసరమైన వారికి ఇతర మందులను పంపిణీ చేయాలని ఆదేశించారు.
మండల విద్యాశాఖాధికారులు స్థానిక పి హెచ్ సి వైద్యాధికారుల సమన్వయంతో విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలన్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని డిఎం సివిల్ సప్లై అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
నాణ్యమైన వెజిటబుల్స్ సేకరించాలని, మెనూ ప్రకారం మాత్రమే భోజనాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే కోడిగుడ్లను మొదటి వారంలో నీలం రంగు స్టాంపును, రెండవ వారంలో పింకు రంగు స్టాంపును మూడవ వారంలో పచ్చ రంగు స్టాంపును నాలుగో వారంలో బ్రౌన్ కలర్ స్టాంపును వినియోగించాలన్నారు. బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువులను నిలువ చేసే రూముల్లో పరిశుభ్రత పాటించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.జగదీశ్వరరావు, డి ఎస్ ఓ. భాస్కర రావు, పి డి., డి ఆర్ డి ఎ లక్ష్మీపతి, FCI అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
