Posted in

Visakhapatnam:శ్రీకాకుళం నుండి నేరుగా చర్లపల్లి కొత్త రైలు ఏర్పాటు చెయ్యాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Central minister k.rammurthy naidu
Central minister k.rammurthy naidu

నవంబర్ 04 : విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు

.డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చెయ్యగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

నూతన రైల్వే జోన్ గెజిట్ అంశాన్ని వేగవంతం చెయ్యాలని కోరిన రామ్మోహన్ నాయుడు.. డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. నిర్ధేశిత సమయంలోనే వాటిని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అమృత్ భారత్ స్టేషన్ లలో అభివృద్ధి పనులు ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చెయ్యమని తెలిపారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల లోగా.. స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలసి రైల్వే అధికారులు అమృత్ భారత్ ప్రతిపాదిత స్టేషన్ లను సందర్శించాలని.. పురోగతిపై క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యాలని కోరారు. బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలు.. అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని.. స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్ లో పనులు వేగవంతం చెయ్యాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్స్ కు టికెట్ ఛార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని.. సమావేశంలో కూడా ఇదే విషయం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. తాను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్లాట్ ఫాంల ఎత్తు పెంచే కార్యక్రమం సక్రమంగా, వేగంగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు.. సబ్ వే ల నిర్మాణం కూడా వేగవంతం చెయ్యాలని స్పష్టం చేశారు.

సబ్ వే లను నిర్మించే కాంట్రాక్టర్లు స్ధానికంగా జవాబుదారిగా ఉండకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. సబ్ వే ల నిర్మాణం లో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుండి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఇంకోవైపు తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చేరు. కరోనా అనంతరం ఆగిపోయిన కామేశ్వరి పేట రిక్వెస్ట్ ట్రైన్ స్టాప్.. మళ్ళీ పునరుద్ధరించాలని.. ఇరవై ఐదు గ్రామాలను వీటి సేవలు కోల్పోయారని తెలిపారు.

గునుపూరు తిరువల్లి రైల్వే లైన్ పనులు కూడా వేగవంతం చెయ్యాలని, టెక్కలిలో ఆర్.ఓ.బి అత్యంత అవసరమని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. టెక్కలి పట్టణం మధ్యలో ఈ గేటు వల్ల ముప్పై, నలభై నిమిషాల వ్యయం పడుతోందని తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చెయ్యాలని, లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలను కల్పిస్తే అభివృద్ధికి మరింత వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లాలో పాసింజర్ రైల్వే సర్వీసులలో సరైన సమయానికి స్టేషన్లకు చేరుకోవడం లేదనే సమస్య ప్రధానంగా వేధిస్తోందని.. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే పాసింజర్ రైళ్లలో నిబంధనలకు లోబడి స్టాప్స్ ను పెంచాలని తెలిపారు.

శ్రీకాకుళం నుండి చర్లపల్లికి, శ్రీకాకుళం నుండి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల అవశ్యకత కూడా ఎంతో ఉందని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. వీటిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అరకు రైలుకు మరిన్ని కోచ్ లను అనుసంధానం చెయ్యాలని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇంకోవైపు ఇలాంటి సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్ళను నడపాలని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఛాలెంజింగ్ డివిజన్ లో అద్భుతమైన పనితీరును రైల్వే అధికారులు కనబరుస్తున్నారని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ సహకారంతో మరింత వేగంగా రైల్వే వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను ఐకానిక్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే 492.69కోట్ల కేటాయింపులు అభివృద్ధి కోసం జరిగినట్టు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్లమెంట్ సభ్యులైన సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గుమ్మ తనూజ రాణి, సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *