విశాఖపట్నం నవంబర్ 3: ఈనెల 10వ తేదీ నుండి 14 తేదీ వరకు విశాఖలో 40వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వి.ఎస్. జయశంకర్ తెలిపారు.
సోమవారం సాయంత్రం ఎంవిపి లో గల పోస్ట్‌మాస్టర్ జనరల్ రీజనల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో పత్రికా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం పోస్టల్ రీజియన్ ఆధ్వర్యంలో 40వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నవంబర్ 10 నుండి 14 వరకు MVP కాలనీలోని S-3 స్పోర్ట్స్ అరీనాలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ క్రీడా పోటీలు పోస్టల్ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు 14 రాష్ట్రాల నుంచి 14 టీములు పాల్గొంటాయని అన్నారు. గత సంవత్సరం గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌లో వెస్ట్ బెంగాల్ జట్టు ప్రతిభ కనబరిచి పలు అవార్డులు గెలుచుకుందని జయశంకర్ గుర్తుచేశారు.
పోటీలు సమగ్రంగా, సమన్వయంతో సాగేందుకు నిర్వాహక కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. క్రీడాభిమానులు, సంస్థలు, ప్రజలు ఈ క్రీడా ఉత్సవానికి మద్దతు తెలపాలని, లోగో మరియు ప్రాస్పెక్ట్ వివరాల కోసం QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చని సూచించారు.
ముందుగా 40వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లోగో, టీజర్‌లను వి.ఎస్. జయశంకర్ విడుదల చేశారు.* *ఈ కార్యక్రమంలో విశాఖ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఎన్.వి.ఎస్.ఎన్. రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.
