Posted in

Vishakapatnam:విశాఖకు తరలివచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ(సిఫీ -Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్

Nara lokesh
Nara lokesh

సిఫీ (Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం: విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) ఏర్పాటుచేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.

ముందుగా మధురవాడలోని ఐటీ పార్క్ కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు మంగళవాయిద్యాల మధ్య సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది.

నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది.

ఈ కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్ తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాస్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఎన్.యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *