- రోడ్డు ప్రక్కనే టన్నుల కొద్దీ బాణాసంచా సామగ్రి నిల్వలు
- రద్దీ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బాణాసంచా సామగ్రి నిల్వలు, స్థానిక ప్రజలు ఆందోళన
విజయనగరం 12-10-2025 : విజయనగరం నుంచి గజపతినగరం వైపు ప్రధాన హైవే రోడ్డు కె.యల్.పురం జంక్షన్ వద్ద దీపావళి బాణసంచా సామాగ్రి హోల్ సేల్ షాపులు,గొడౌన్లు ఎన్నో ఏళ్లుగా కోట్ల రూపాయల వ్యాపారం ఈ జంక్షన్ వద్ద సాగుతోంది. దీపావళి పండుగ పది రోజుల ముందు నుంచే ఈ జంక్షన్ వద్ద గోడౌన్ లన్నీ జనంతో కిక్కిరిసి పోతాయి..
సాధారణంగా ప్రమాదకరమైన బాణాసంచా సామగ్రి నిల్వలు ఊరి చివర జనావాసాలు లేని చోట తగు జాగ్రత్తలు తీసుకొని నిల్వ చేయాలి..అగ్నిమాపక శాఖ వారి నియమ నిబంధనలకు అనుగుణంగా మందుగుండు సామగ్రి నిల్వలు, పర్యవేక్షణ పాటించాలి.
గతంలో కె.యల్.పురం ప్రాంతంలో పెద్దగా నివాస గృహాలు, రోడ్డు పై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండేదికాదు, కాని ప్రస్తుతం పరిస్థితి మారింది, రోడ్డు పై వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్ రద్దీ గా మారింది. జన సందోహం ఎక్కువగా ఉంటుంది, సమీపంలో ఇండ్లు, పెట్రోల్ బంక్ లాంటివి పుట్టుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో బాణాసంచా సామగ్రి నిల్వలు రోడ్డు ప్రక్కనే ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇంత రద్దీ ప్రాంతంలో బాణాసంచా సామగ్రి నిల్వలు ప్రజా జీవనానికి శ్రేయస్కరం కాదని.. జనావాసాలకు దూరంగా వీటిని తరలించాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు చెప్పిరావాని, ఇంత పెద్ద మొత్తంలో బాణాసంచా సామగ్రి నిల్వలు కారణంగా ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టం ,ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యులనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది.
