విజయనగరం, అక్టోబర్ 13 : తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి, ఈ ప్రాంత ప్రజల ఏళ్లనాటి కలను సాకారం చేసిన మహనీయుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు అని, రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు.
రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటుచేసిన బుచ్చి అప్పారావు విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, తాటిపూడి రిజర్వాయర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు త్రాగు, సాగు నీరు అందుతుందని, ఈ ఘనత బుచ్చి అప్పారావు వల్లె సాధ్యమైందని పేర్కొన్నారు.
రైతులను భూములు కోల్పోతున్న వారిని, అధికారులను, ప్రభుత్వాన్ని ఒప్పించి రిజర్వాయర్ని కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదని, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బుచ్చి అప్పారావు వల్లనే అది సాధ్యమైందని అన్నారు. ఆయన ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు.
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతంకోసం అలుపెరగని పోరాటం చేసిన గొర్రెపాటి బుచ్చి అప్పారావు జీవితం ప్రస్తుత సమాజానికి దిక్సూచిగా చెప్పవచ్చని, రైతాంగ సమస్యలపై ఆయన చేసిన పోరాటంలో భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు.
తాను పుట్టిన కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ఆరుగాలం కష్టించి పనిచేసే రైతాంగం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన స్ఫూర్తి ఉత్తరాంధ్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందనటంలో అతిశయోక్తి లేదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హమీ ఇస్తున్నానని అన్నారు.
స్వాతంత్ర్య సమరయోదులుగా, శాసన సభ్యులుగా గొర్రెపాటి బుచ్చి అప్పారావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్ మాధవ్ , మాజీ మంత్రి,జి మాడుగుల ఎంఎల్ఏ బండారు సత్యనారాయణ మూర్తి,యస్ కోట ఎంఎల్ఏ కోళ్ళ లలిత కుమారి, బొబ్బిలి ఎంఎల్ఏ ఆర్ వి యస్ కె కె రంగారావు (బేబినాయన) యం యల్ సి గాదె శ్రీనివాసులు నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వి, మాజీ యంపీపీ కొండపల్లి కొండలరావు, తాటిపూడి రిజర్వాయర్ ఆయకట్టు సంఘం అధ్యక్షులు కె జగన్నాధరావు, బుచ్చి అప్పారావు కుటుంబసభ్యులు రమణమ్మ, భాలగంగాధర్ తిలక్, రమాదేవి, ఈశ్వరి తదితరులు, విగ్రహ కమిటీ సభ్యులు పి పరదేశి నాయుడు, అల్లు విజయ్, కె భాస్కర్ నాయుడు, బి అప్పల నాయుడు, ఆర్ అర్జునమహేశ్వరరావ్, చినరామునాయుడు,రాము నాయుడు, వి కృష్ణ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
