Posted in

విశాఖలో పరిశుభ్రతా విప్లవం వైపు అడుగులు – ఎంపీ-ఎం. శ్రీ భరత్

MP BHARATH
MP BHARATH

విశాఖపట్నం:విశాఖపట్నం ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన, బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని ఎంపీ ఎం. శ్రీ భరత్ అన్నారు. నగర విశిష్ఠతను పెంచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం ఒక సానుకూల మార్పుకు నాంది కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.“ఫుట్‌పాత్‌లు మనుషులు నడవడానికి, ఆక్రమణల కోసం కావు” అని శ్రీ భరత్ స్పష్టం చేశారు.

ఈ సమస్య విశాఖలో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఉందని గుర్తుచేశారు.జూ, కైలాసగిరి ప్రాంతాల్లో చేపట్టనున్న వినూత్న ప్రాజెక్టుల కోసం సింగపూర్‌కి వెళ్లి అధ్యయనం చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. “సింగపూర్‌లో గార్డెన్ ఇన్ ది సిటీ అనే నినాదం బయో ఫ్లెక్స్ సిటీగా రూపాంతరం చెందింది. అక్కడ మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రత్యేక నడకదారులు, వంతెనలు ఏర్పాటు చేశారు,” అని వివరించారు.

సింగపూర్ ప్రజల్లో పరిశుభ్రతపై ఉన్న బాధ్యతా భావం మన దేశ ప్రజల్లో కూడా అలవడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇటీవల జరిగిన దుకాణాల తొలగింపుపై స్పందిస్తూ, “దీనికి వెనుక మంచి ఉద్దేశం ఉంది. సింగపూర్ తరహాలో వెండింగ్ సముదాయాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఒకే చోట అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నాం,” అని తెలిపారు.

ఆపరేషన్ లంగ్స్‌పై నిర్వహించిన సర్వేల్లో 80 శాతం మంది ఈ నిర్ణయం సానుకూలమని అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. “స్టాళ్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం,” అని భరోసా ఇచ్చారు.“క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు నడక, వ్యాయామం అవసరం. విశాఖలో మరిన్ని మార్పులు రావాల్సి ఉన్నాయి. అవి ప్రజల సహకారంతోనే సాధ్యమవుతాయి,” అని ఎంపీ పేర్కొన్నారు.

అంతేకాకుండా, డ్రైన్ల నిర్వహణకు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు తమ ప్రచార కార్యక్రమాల్లో డిజిటల్ బోర్డులను ఉపయోగించడం వల్ల నగర అందం కాపాడగలమని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *