Posted in

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకం: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Minister kondapalli Srinivas
Bhogapurm airport

గజపతినగరం, జూలై 27: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.
సోమవారం గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పరిశీలకుడు దామచర్ల సత్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గూగుల్ వంటి సంస్థల రాకతో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మెంటాడ రోడ్డు నిర్మాణానికి రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి సుమారు 20 వేల మందిని ప్రధాని సభకు సమీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
దామచర్ల సత్య మాట్లాడుతూ, విజయనగరం ప్రాంతంలో లక్షలాది మంది పాల్గొనే ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానికి స్వాగతం పలకాలన్నారు.
పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ, సాధారణంగా వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు నిర్వహించే ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న ప్రత్యేక అభిమానంతో స్వయంగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టమని అన్నారు. ఆగస్టు 1 ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, బీజేపీ నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకుడు మర్రపు సురేష్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *