జడ్పీ చైర్మన్ పదవికి పోటీకి సిద్ధం

Vizianagaram
Vizianagaram

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తారనే ఆశాభావం: వబ్బిన సత్యనారాయణ

శృంగవరపుకోట, సెప్టెంబర్ 7 (జనకమలం):
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్‌చార్జ్ వబ్బిన సత్యనారాయణ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయనగరం జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సీనియర్ రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు తదితరుల రాజకీయ వారసులను ఎన్నికల బరిలోకి దింపేందుకు వైసీపీ, టీడీపీ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో యువతకు, కొత్త నాయకత్వానికి రాజకీయ అవకాశాలు లభించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున తాను జడ్పీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వబ్బిన సత్యనారాయణ జనకమలం ప్రతినిధికి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు యువత రాజకీయంగా ఎదగాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తగిన రాజకీయ అవకాశాలు అందడం లేదని అభిప్రాయపడ్డారు. కేవలం కొన్ని కుటుంబాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్న భావన కాపు సామాజిక వర్గంలోని యువతలో ఉందని పేర్కొన్నారు. జనసేన పార్టీ ద్వారా కొత్తవారికి, యువతకు రాజకీయ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తూ, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి సమన్వయానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని చెప్పారు.
పార్టీ కోసం తాను చేసిన సేవలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తారనే నమ్మకం తనకు ఉందని వబ్బిన సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో పనిచేస్తానని ఆయన తెలిపారు.