శృంగవరపుకోట: కొట్టాం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఇచ్చిన PGRS ఫిర్యాదును అధికారులు కేవలం నిధుల అవసరాన్ని పేర్కొంటూ క్లోజ్ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శీర రమేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొట్టాం గ్రామంలోని పంచాయతీ భవనం, గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, ఇప్పటికే ప్రజాధనం వెచ్చించినప్పటికీ భవనాలు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ 2026 జనవరి 5న PGRSలో VZM20260105561 నంబర్‌తో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ ఫిర్యాదుకు అధికారులు ఇచ్చిన సమాధానంలో నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు అవసరమని పేర్కొన్నారు. పంచాయతీ భవనానికి ₹9.45 లక్షలు, గ్రామ సచివాలయానికి ₹27.90 లక్షలు, రైతు సేవా కేంద్రానికి ₹13.82 లక్షలు అవసరమని అధికారులు వెల్లడించారు. మొత్తం ₹51.17 లక్షల నిధులు అవసరం అని సమాధానంలో పేర్కొన్నట్లు రమేష్ కుమార్ తెలిపారు.

అయితే, అవసరమైన నిధుల వివరాలను మాత్రమే తెలియజేసి PGRS ఫిర్యాదును క్లోజ్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మాణాలను ప్రారంభించి, వాటిని అర్ధాంతరంగా నిలిపివేశారని, మిగిలిన నిధులను సమకూర్చి నిర్మాణాలను పూర్తి చేసే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
“ప్రజలకు కావాల్సింది సమాధానం కాదు.. పరిష్కారం” అని శీర రమేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం అధికారిక సమాధానాలతో ఫిర్యాదులను ముగించడం సరైన విధానం కాదని విమర్శించారు.
అధికారులు రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికి కాకుండా ప్రజల కోసం ధైర్యంగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కొట్టాం గ్రామంలోని అసంపూర్తి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే సమకూర్చి పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
