విశాఖపట్నం, అక్టోబర్ 7:జాతీయ ఆహార భద్రత చట్టం – 2013 అమలులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు మంగళవారం విశాఖపట్నం పరిధిలోని రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా గాజువాక ప్రాంతంలోని రేషన్ డిపో నం. 0388294 తనిఖీ చేసిన ఆయన, స్టాక్ బోర్డులో వివరాలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆ వివరాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తర్వాతి డిపో 0388303 లో పరిశుభ్రత లోపించినందున, డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అంతేగాక 0388606, 0388604 డిపోలలో లబ్ధిదారులకు సరుకులు సకాలంలో సరఫరా అయ్యేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. 0388590 డిపోలో స్టాక్ రిజిస్టర్ లో గందరగోళం ఉందని గుర్తించిన బి. కాంతారావు, సంబంధిత అధికారులను విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం కొంచమాంబ కాలనీ అంగన్వాడీ కేంద్రం, అగనంపూడి జెడ్పీ హైస్కూల్ ను సందర్శించిన ఆయన, మధ్యాహ్న భోజన పథక అమలు తీరును సమీక్షించారు. పిల్లలకు ఇచ్చే గుడ్ల బరువు తక్కువగా ఉండటం గమనించిన ఆయన, స్కూల్ హెడ్‌మాస్టర్‌ను హెచ్చరించి, కాంట్రాక్టర్ తో చర్చించి నాణ్యతాపరంగా ఆహార సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో సివిల్ సప్లై శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రోలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు. గాజువాక ఏఎస్ఓ కృష్ణ, ఆర్‌ఐలు బంగార్రాజు, పల్లా మహేష్ తదితరులు ఈ తనిఖీలకు హాజరయ్యారు.
