Posted in

Vizianagaram:మన కళ్ళను ప్రేమిద్దాం, (అక్టోబర్ 9) 26 వ ప్రపంచ దృష్టి దినోత్సవం

World sight day
World sight day

విజయనగరం, అక్టోబర్ 08 :సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కంటి చూపే జీవితానికి వెలుగు. కళ్ళు లేకుంటే జీవితమంతా అంధకారమయమే. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్ళ సంరక్షణ పై ఒక లుక్కేద్దాం..

ప్రపంచంలో ప్రతి ఒక సెకండ్ కు ఒక వ్యక్తి దృష్టి కోల్పోతున్నాడని మీకు తెలుసా! అదే విధంగా వివిధ కారణాలతో ప్రతి ఒక నిమషానికి ఒక చిన్నారి దృష్టిని కోల్పోతున్నాడు. 2022 సంవత్సరంలో నిర్వహించిన జాతీయ సర్వే ఆధారంగా మన భారత దేశంలో జనాభాలో 0.36% మంది అంధులు ఉన్నారు. అంటే 4.95 మిలియన్ల మంది అందత్వంతోనూ, మరో 35 మిలియన్ల మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 80% అందత్వం సకాలంలో నేత్ర పరీక్షలు చేసుకోవడం ద్వారా  నివారించ వచ్చును.  ఒక వ్యక్తి అంధత్వం పొందడం వలన తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ. 1,70,624 నష్టం వాటిల్లుతుందని అంచనా.

కంటి సంరక్షణ కొరకు అవగాహన కల్పించడం కోసం జాతీయ, అంతర్జాతీయ నేత్ర సంరక్షణ సంస్థలు ప్రతి ఏటా అక్టోబర్ రెండవ గురువారం ” ప్రపంచ దృష్టి దినోత్సవం” నిర్వహిస్తున్నాయి. మీ కళ్ళు మీ జీవితానికి వెలుగును ప్రసాదించే అమూల్యమైన వరం. కంటి చూపే జ్ఞానానికి ద్వారం, ఆనందానికి ఆరంభం. రంగుల రమ్యత, ప్రకృతి సౌందర్యం .. ఇవన్నీ మనకు అనుభూతి చేయించేది కంటి దృష్టి. ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం యొక్క థీమ్ “మీ కళ్ళను  ప్రేమించండి” తద్వారా మీ కళ్ళను సంరక్షించుకోండి.

జిల్లా అందత్వ నివారణ సంస్థ చైర్మన్ గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్ గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో జిల్లాలోని ఆప్తాల్మిక్ ఆఫీసర్స్ వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన స్వచ్ఛంద నేత్ర ఆసుపత్రిలలో కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించి అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తున్నారు. ప్రజల్లో నిరంతరం నేత్రదానం, ప్రాథమిక నేత్ర సంరక్షణ అవగాహన కార్యక్రమాలను పాఠశాలల్లో, గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.

మీ కళ్ళను ఇలా పరిరక్షించుకోండి డాక్టర్.త్రినాథరావు,జిల్లా అంధత్వ నివారణ ప్రాజెక్ట్ మేనేజర్

మీరు, మీ చిన్నారులు పసుపు పచ్చని ఆకు కూరలు, కూరగాయలతో ఉన్న మంచి పోషకాహారం మీ యొక్క ఆహారంలో తరచుగా తీసుకోండి. మీకు గాని, మీ చిన్నారులకు గాని కంటికి గాయం తగిలినపుడు వెంటనే, నేత్ర వైద్య నిపుణులను సంప్రదించండి. సొంతవైద్యం చేయవద్దు.మీ చిన్నారుల్లో మెల్ల కన్ను, టోసిస్ (కంటి పై రెప్ప కొద్దిగా వాలినట్టు ఉన్నట్టయితే) గమనించిన యెడల వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు మీ చిన్నారులు అవసరం మేరకు మాత్రమే టీవీ, మొబైల్, లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *