ద్వాక్రా మహిళల కష్టార్జిత పెట్టుబడులు నష్టాల్లో – ప్రభుత్వం స్పందించాలంటూ ఆవేదన
రిపోర్టర్ – (పి.సురేష్) జన కమలం ప్రతినిధి | విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా ద్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వం “ఫైలైట్ ప్రాజెక్ట్” గా ప్రారంభించిన స్మార్ట్ బజార్ మహిళా మార్ట్‌లు ప్రస్తుతం మూతపడిన దశకు చేరాయి.గరివిడి, శృంగవరపుకోట మండల కేంద్రాల్లో సుమారు ₹90 లక్షల వ్యయంతో ఈ రెండు బజార్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో ద్వాక్రా మహిళ ₹310 చొప్పున పెట్టుబడి పెట్టారు.
ప్రారంభంలో లాభాలు – ఇప్పుడు నష్టాల పాలన

ప్రారంభంలో ప్రతి రోజూ ₹90,000 నుండి ₹1 లక్ష వరకు అమ్మకాలు జరిగి వ్యాపారం సజావుగా సాగింది. ఏడాది పాటు మంచి లాభాలు వచ్చాయి.
కానీ తరువాత సిబ్బంది నిర్లక్ష్యం, మహిళా లీడర్ల చేతివాటం, ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా అమ్మకాలు తగ్గిపోయి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యాయని ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం షాపులు ఖాళీగా మారి నెలకు ₹25,000 అద్దె చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది.

“స్మార్ట్ బజార్” అని ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పుడు “ఖాళీ బజార్”గా మారిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
మహిళల ప్రశ్నలు – పారదర్శకత ఎక్కడ?
పెట్టుబడి పెట్టిన ద్వాక్రా మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

“మేము కష్టపడి పొదుపు చేసిన డబ్బు ఎక్కడికి పోయింది? లాభ నష్టాలపై ఎవరూ వివరాలు ఇవ్వడం లేదు” అని వారు ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పదిహేడునెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల స్పందన

ఈ విషయంపై వెలుగు సమాఖ్య ప్రత్యేక అధికారి శ్రీమతి అరుణ మాట్లాడుతూ –
“స్మార్ట్ బజార్‌లలో అమ్మకాలు ఎందుకు తగ్గాయి, నష్ట నివారణ చర్యలపై అధ్యయనం చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ఆ తరువాత నిర్ణయం పైస్థాయి అధికారులదే.”
అయితే ఈ సమాధానంతో మహిళలు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని సిద్ధమవుతున్నారు.
ప్రజల డిమాండ్ – విచారణ జరిపి బాధ్యులను బహిర్గతం చేయాలి
లాభాల్లో నడిచిన వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
“బాధ్యులపై విచారణ జరిపి పెట్టుబడిదారులకు నష్టపరిహారం చెల్లించాలని” మహిళలు కోరుతున్నారు.
ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
