విజయనగరం, అక్టోబరు 21 ః జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాల్లోని చిన్నచిన్న నదులు, గెడ్డల్లో అనుమతి పొందిన థర్డ్ ఆర్డర్ రీచుల్లో దొరుకుతున్న ఇసుక ఆయా గ్రామాల అవసరాలకు మాత్రమేనని, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. వారికి ఇస్తున్న కూపన్లపై తప్పనిసరిగా తేది, పంచాయితీ కార్యదర్శి సంతకం ఉండాలని ఆదేశించారు. ఇలాంటి రీచుల్లో ఎక్కడా ఇసుక తవ్వకానికి మిషన్లు వాడకూడదని, వాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేయకుండా, అనుమతి పొందిన 48 థర్డ్ ఆర్డర్ ప్రదేశాల్లోనే ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రస్తుతం ఇసుక లభ్యత, డిమాండ్‌పై సమీక్షించారు. థర్డ్ ఆర్డర్ రీచ్‌లు 48 ఉన్నాయని, రెండు స్టాకు పాయింట్ల ద్వారా నాణ్యమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లానుంచి తెప్పించి అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధుమాధవన్ వివరించారు. జిల్లాలో ఏడాదికి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ఆ మేరకు అందుబాటులో ఉంచుతున్నామని గనులశాఖ డిడి సిహెచ్ సూర్యచంద్రరావు తెలిపారు. కొత్తవలసవద్ద ఇసుక స్టాక్ పాయింట్ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని చెప్పారు. రుతుపవనాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇసుక ప్రణాళికలను వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. త్రాగునీటి పథకాలవద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలన్నారు. థర్డ్ ఆర్డర్ రీచుల్లోని ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమేనని, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ రీచ్‌ల జాబితాను సంబంధిత తాహసీల్దార్లకు, పోలీసులకు అందజేయాలని, ఆయా చోట్ల ఇసుక తవ్వకాలు, రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీసిల్టింగ్ పూర్తయిన చోట, నాణ్యత తక్కువతో లభించే ఇసుకను ఫిల్లింగ్‌కు వినియోగించేలా చూడాలని సూచించారు. అదేవిధంగా అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలపైనా దృష్టి సారించాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జెసి సేధుమాధవన్‌తోపాటు, మైన్స్ డిడి సూర్యచంద్రరావు, డిటిసి మణికుమార్, ఆర్‌డిఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఆశయ్య, డిపిఓ మల్లికార్జునరావు, ఇరిగేషన్ ఇఇ వెంకటరమణ, పొల్యూషన్ ఇఇ సరిత, పలువురు తాహసీల్దారులు పాల్గొన్నారు.
