విజయనగరం, రాజాం: భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి మార్గదర్శకమైన కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక, కళారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం విజయనగరం జిల్లా రాజాంలోని వస్త్రపురి కాలనీలో జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రంను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాటక సమాజాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.కళాకారులకు ఏ సౌకర్యం కల్పించాలన్నా సంబంధిత డేటా బ్యాంకు ఉపయోగపడుతుందన్నారు. కళారంగం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఈ సందర్భంగా రాజాం శాసనసభ్యులు కోండ్రు మురళి కళాకారుల అభ్యున్నతి కోసం అందించిన ప్రతిపాదనలు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో కళారంగం అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని స్థానిక నాయకులకు, నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి సంబంధిత అంశాలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
