Posted in

భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు రూ.9.12 కోట్ల నిధులు

భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు!
Minister kondapalli Srinivas
Minister kondapalli Srinivas

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు, కార్మికులు

గజపతినగరం, సెప్టెంబర్ 29: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల జీతాలు, వీఆర్ఎస్ బకాయిల చెల్లింపుల కోసం రూ.9.12 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల ఆహ్వానం మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం భీమసింగి శ్రీ విజయ రామ గజపతి సహకార చక్కెర కర్మాగారానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు ‘థాంక్యూ సీఎం సార్.. థాంక్యూ కొండపల్లి సార్’ అంటూ ప్లకార్డులతో మంత్రికి స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన అభినందన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, తాను అసెంబ్లీలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ సమస్యను ప్రస్తావించి ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలిపారు.

ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని జీతాలు, వీఆర్ఎస్ బకాయిల చెల్లింపులకు రూ.9.12 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధుల ద్వారా 300కు పైగా కుటుంబాలకు ప్రయోజనం కలగడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రైతులు, షేర్‌హోల్డర్లతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ.. మూతపడిన ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికులు జీతభత్యాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు, కార్మికులకు నిధుల మంజూరు కోసం జీవో రావడం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని తెలిపారు.

డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీ సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలనే సంకల్పంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కృషి ఫలితంగా నిధుల మంజూరుకు జీవో వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *