Posted in

జనసేన ఆవిర్భావ దినోత్సవం రద్దు: ఇది కూడా రాజకీయ వ్యూహమా?

Janasena party
Janasena party

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ ఏడాదితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ప్రతి సంవత్సరం మార్చి 14న జరుపుకునే జనసేన ఆవిర్భావ దినోత్సవం పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అయితే ఈసారి ఆ వేడుకలను రద్దు చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.

ఆవిర్భావ దినోత్సవం అంటే భారీ

సభజనసేన పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. సినీ నటుడిగా “పవర్ స్టార్”గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల్లో విపరీతమైన ఆకర్షణను సంపాదించారు. ఆయన ప్రసంగాన్ని వినడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సైనికులు లక్షలాదిగా తరలివస్తారు.

ఈ సభల్లోనే రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అనేక కీలక నిర్ణయాలు ప్రకటించబడిన సందర్భాలు ఉన్నాయి. పొత్తులు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

పిఠాపురంలో భారీగా జరిగిన వేడుకలు

2025లో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం లో అత్యంత వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు సాగిన ఆ కార్యక్రమాలు పార్టీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో భారీగా జనాలు తరలి వచ్చారు. ఆ సభలో ఆయన చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం కూడా రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది

ఈసారి వేడుకలు రద్దు

ఇక ఈ ఏడాది మార్చి 14న జరగాల్సిన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుండటంతో దానిపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

గత నెల 26న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేవలం 12 రోజుల్లోనే సుమారు 8.7 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉత్సాహాన్ని మరింతగా కొనసాగించేందుకు సభ్యత్వ కార్యక్రమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికలపై దృష్టి

ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీకి కీలకంగా మారింది. గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పార్టీని బలోపేతం చేయడానికి ఈ సభ్యత్వ కార్యక్రమం సహాయపడుతుందని జనసేన నాయకత్వం భావిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని పెంచుకోవాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో 2029 ఎన్నికల నాటికి మరింత బలంగా నిలబడేందుకు ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీని విస్తరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయ వర్గాల్లో మరో చర్చ

అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీకి సంబంధించి కొన్ని వివాదాస్పద అంశాలు రాజకీయ చర్చకు దారి తీసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తిరుపతి లడ్డు వివాదం, సుగాలి ప్రీతి అంశం, పిఠాపురం దళితులపై జరిగిన కుల బహిష్కరణ ఆరోపణలు, కైకలూరు లో దళితులపై దాడి ఆరోపణలు వంటి అంశాలు ఇటీవల రాజకీయంగా చర్చకు వచ్చాయి.

అదే సమయంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన రేషన్ బియ్యం మాఫియా, మిస్సింగ్ మహిళల అంశాలపై పెద్దగా చర్యలు కనిపించలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి

మార్చి నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం కేవలం సాకే కావచ్చని, అసలు కారణాలు రాజకీయ వ్యూహాలకు సంబంధించినవే కావచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యూహాత్మక నిర్ణయమా?

మొత్తానికి ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని రద్దు చేయడం వెనుక సభ్యత్వ కార్యక్రమం ప్రధాన కారణమా? లేక రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *