విజయనగరం, జూలై 18: ప్రజల సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం ఎంత వేగంగా స్పందించగలదో మరోసారి నిరూపితమైంది. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమనాన్ని అందించింది.
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని పోర్టికో నుంచి తన ఛాంబర్‌కు వెళ్తుండగా, ఆందోళనతో నిలుచున్న పాలూరి పద్మ అనే మహిళను గమనించి స్వయంగా ఆమె సమస్యను తెలుసుకున్నారు.
పాలూరి పద్మ తన మానసిక వికలాంగురాలైన కుమార్తె పాలూరి భాగ్యశ్రీ కుల ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ పొరపాటుగా నమోదైందని, దానిని సవరించేందుకు వచ్చామని కలెక్టర్‌కు వివరించారు.
దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సవరించాలంటే ముందుగా దానిని రద్దు (రివోక్) చేయాల్సి ఉంటుందని, అనంతరం కొత్త దరఖాస్తు ఆధారంగా సవరించిన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయవచ్చని తహసీల్దార్ వివరించారు.
అనంతరం కలెక్టర్ బాధిత మహిళకు ధైర్యం చెబుతూ, జాయింట్ కలెక్టర్ వచ్చిన వెంటనే అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి అదే రోజు సాయంత్రంలోగా సవరించిన ధ్రువీకరణ పత్రం అందజేస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయగా, కుటుంబ సభ్యులు వెంటనే కొత్త దరఖాస్తు సమర్పించారు. నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వేగంగా చర్యలు చేపట్టి, అదే రోజు సవరించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.
ఉదయం సమస్యతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కుటుంబం, సాయంత్రానికే పరిష్కారంతో ఇంటికి చేరుకోవడం పట్ల పాలూరి పద్మ ఆనందం వ్యక్తం చేశారు. తన సమస్యను స్వయంగా విని, గంటల వ్యవధిలో పరిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా, వాటికి తక్షణ పరిష్కారం చూపాలనే జిల్లా కలెక్టర్ వైఖరి మరోసారి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించింది.
hu
