విజయనగరం, అక్టోబరు 09 ఃఅనుమతి లేకుండా బాణాసంచాను విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న బాణా సంచా విక్రయాలు, తయారీపై పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం ముగ్గురు తయారీ దారులు ఉన్నారని, 15 మంది హోల్‌సేల్ విక్రయదారులు ఉన్నారని డిఆర్ఓ శ్రీనివాసమూర్తి వివరించారు. ఆర్‌డిఓలు డి.కీర్తి, మోహనరావు, ఆశయ్య మాట్లాడుతూ తమ డివిజన్ల పరిధిలో బాణాసంచా విక్రయాలగురించి వివరించారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, బాణాసంచాను ఏ స్థాయిలో విక్రయించినా అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్‌సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలన్నారు. గ్రామాల్లో జరిపే విక్రయాలను విఆర్ఓలు తనిఖీ చేయాలని ఆదేశించారు. విక్రయాల కోసం అనుమతి పొందినవారు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని, నీరు అందుబాటులో ఉంచాలని, ఫైర్ సిలండర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. తాత్కాలిక విక్రయాలకు అనుమతిచ్చే చోట షాపులమధ్య ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు వీలుగా ఖాళీలు ఉంచాలని చెప్పారు. షెడ్లను టెంట్లకు బదులుగా రేకులతోనే నిర్మించాలని సూచించారు. విక్రయదారులతో సమావేశాలను ఏర్పాటు చేసి, వారికి నిబంధనలను వివరించాలని ఆర్‌డిఓలను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, డిఎస్‌పి వీర్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తాహసీల్దార్లు పాల్గొన్నారు.
