Posted in

గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు – పాడేరులో జిల్లా స్థాయి సమావేశం

Alluri SeetharamaRajuDistrict
Alluri SeetharamaRajuDistrict

పాడేరు, ఆగస్టు 3: గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి (హైపవర్) కమిటీ ఏర్పాటు దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి అధ్యక్షతన గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
గతంలో హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీలో సభ్యులుగా ఉండే గిరిజన సంఘాల ప్రతినిధుల పేర్లను ఖరారు చేసే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమని శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ, అదనపు ఎస్పీ శ్రీమతి శృతి పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ గిరిజన ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.
హైపవర్ కమిటీలో సభ్యులుగా శ్రీ బాబూరావు నాయుడు (రిటైర్డ్ ఐఏఎస్), శ్రీ కొబ్బా శ్రీనివాస్ (లీగల్ అడ్వైజర్) పేర్లను గిరిజన సంఘాల నాయకులు ప్రతిపాదించారు. మిగిలిన ముగ్గురు సభ్యుల పేర్లను పరస్పర సంప్రదింపుల అనంతరం ఏకాభిప్రాయంతో ఖరారు చేసి రేపటిలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన సంఘాల నాయకులు తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అసౌకర్యం కలిగే రీతిలో రహదారులపై ఆందోళనలు చేపట్టకుండా సహకరించాలని కోరారు.
దీనిపై స్పందించిన గిరిజన ఉద్యమ నాయకులు తమ డిమాండ్లు, వినతులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి తెలియజేస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సానుకూల చర్చలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *