అనంతగిరి మండలంలోని గుమ్మకోట, గరుగుబిల్లి, ఎన్.ఆర్.పురం, భీంపోలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ మయమైన గిరిజన భూములు
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు 1:
గిరిజనుల భూములను రక్షించాల్సిన చట్టపరమైన రక్షణ లేకపోవడం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పలు నాన్-షెడ్యూల్ జిరాయతీ గిరిజన గ్రామాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. గుమ్మకోట, గరుగుబిల్లి, ఎన్.ఆర్.పురం, భీంపోలు తదితర గ్రామాల్లో ఒకప్పుడు గిరిజనులు సాగు చేసిన భూముల్లో నేడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, ఈ గ్రామాలు 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం పరిధిలో లేకపోవడంతో, గిరిజనుల జిరాయతీ భూములు తక్కువ ధరలకు కొనుగోలు చేయబడి, తరువాత భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. దీంతో భూమిని కోల్పోయిన అనేక గిరిజన కుటుంబాలు తమ సాంప్రదాయ జీవనాధారాన్ని కోల్పోయి ఉపాధి కోసం తెలంగాణ,గుజరాత్ కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంఘాల అభిప్రాయం ప్రకారం, ఈ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండి 1/70 చట్టం అమలులో ఉంటే గిరిజన భూముల బదలాయింపుపై కఠిన నియంత్రణ ఉండేదని, ఈ స్థాయిలో భూములు రియల్ ఎస్టేట్‌గా మారే పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు.
ఈ పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి, గతంలో జరిగిన భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, వెంచర్ల అనుమతులను పరిశీలించాలని, అర్హత ఉన్న నాన్-షెడ్యూల్ గిరిజన గ్రామాలను వెంటనే షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చి 1/70 చట్టాన్ని అమలు చేయాలని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
