ఎడిటోరియల్ విశ్లేషణ — జర్నలిస్టు పి. సురేష్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ ఆసక్తికర దశలోకి ప్రవేశిస్తున్నాయి. అధికార–ప్రతిపక్ష సమీకరణాలు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పునరుత్తేజం పొందుతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దిశపై పార్టీ క్యాడర్‌లో చర్చ మొదలైంది. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ వ్యూహాత్మకంగా తన స్థావరాన్ని బలపరుస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ — రాజకీయ మలుపు
ఏపీ రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్.ఆ ఘటన టీడీపీ క్యాడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. నాయకత్వం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అదే సమయంలో జనసేన కార్యకర్తలు రాజకీయంగా చురుకుదనం చూపిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే ఆశలు వ్యక్తం చేసినట్లు రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.అయితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా ఎదగడం కన్నా కూటమి రాజకీయాలకే పవన్ ప్రాధాన్యం ఇవ్వడం జనసేనలో అంతర్గత చర్చలకు దారితీసింది.
జనసేన క్యాడర్ ఆలోచనలు పార్టీ ఎదుగుదలపై సందేహాలు..
కూటమి విజయంతో అధికారంలో భాగమైనప్పటికీ, పార్టీ నిర్మాణంపై స్పష్టమైన చర్యలు లేకపోవడం జనసేన క్యాడర్‌లో అసంతృప్తిని పెంచిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.నామినేటెడ్ పదవులతో కొంతమందిని సంతృప్తిపర్చినా, గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణ జరగకపోవడం కార్యకర్తలను ఆలోచనలో పడేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.టీడీపీతో దీర్ఘకాల కూటమి కొనసాగుతుందని పవన్ చేసిన ప్రకటనలు — జనసేన స్వతంత్ర రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తించాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
జగన్ మళ్లీ బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కనబడే కోణం
ప్రస్తుతం అధికారంలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తి ప్రధానంగా జగన్ వైపు రాజకీయ అవకాశంగా మారుతోంది. ఒంటరిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించడం ఆయనకు రాజకీయంగా బలం చేకూరుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
లోకేష్ నిశ్శబ్ద రాజకీయాలు
ఇదే సమయంలో లోకేష్ పార్టీ నాయకులతో సంబంధాలు పెంచుకుంటూ, కూటమి రాజకీయాల్లో సమతౌల్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. భవిష్యత్ నాయకత్వంపై టీడీపీ క్యాడర్‌లో కొత్త చర్చలు మొదలయ్యాయి.
జనసేనకు ముందున్న సవాళ్లు
ప్రస్తుతం జనసేన ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు స్వతంత్ర రాజకీయ గుర్తింపును నిలబెట్టుకోవడం.కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలాన్ని పెంచకపోతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా, టీడీపీ పార్టీతో పాటు లోకేష్ తన స్ధానాన్ని ఎలా నిలుపుకుంటారు,జనసేన కేడర్ కోరుకుంటున్న ముఖ్యమంత్రి పదవి కోసం పవన్ ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ అంశాలపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజుల వేచి చూడాల్సిందే..!
