కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్
విశాఖపట్నం | ఫిబ్రవరి 6
దేశాభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత భారత్’ సంకల్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులతో కలిసి విద్య, వైద్యం, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వికసిత విశాఖ జిల్లా దిశగా చర్యలు
సమావేశంలో లంక దినకర్ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాను వికసిత విశాఖ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సంతృప్తి ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలపై ప్రత్యేక దృష్టిప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని పేర్కొన్న చైర్మన్, జల్ జీవన్ మిషన్ మరియు AMRUT పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెంచేందుకు VBG రామ్ జీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీనివల్ల పనుల కొలతలు, చెల్లింపుల్లో అవకతవకలకు అవకాశం ఉండదన్నారు. ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు, వ్యవసాయ పనుల సమయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా 60 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.96 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు.
వైద్య ఆరోగ్య పథకాల అమలుపై సమీక్షజిల్లాలో అమలవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సర్వీసెస్ (RCH), అనీమియా ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, జనని శిశు సురక్ష కార్యక్రమం, పీఎం సురక్షిత మాతృ అభియాన్, కిషోర్ స్వస్థత, పీఎం టీబీ ముక్త్ భారత్, పీఎం జన్ ఆరోగ్య యోజన పథకాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మెటర్నటీ డెత్‌లు తగ్గించే దిశగా వైద్యాధికారులు మరింత కృషి చేయాలని సూచించారు.
విద్యా శాఖ పథకాలపై సమీక్షవిద్యాశాఖ పరిధిలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం (PM పోషణ్), పీఎం శ్రీ స్కూల్స్, డా. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర తదితర పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
ఉపాధి హామీ పథకంలో నకిలీ కార్డుల తొలగింపు
MGNREGSలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని, నకిలీ జాబ్ కార్డులను తొలగించి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలుపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీఎం సూర్య ఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా లబ్ధి పొందేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వైద్య, విద్య శాఖ అధికారులకు అభినందనలు
విశాఖ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పూర్తిస్థాయిలో జరుగుతున్నందుకు జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య, విద్య శాఖ అధికారులను లంక దినకర్ అభినందించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే విశాఖ జిల్లాలో పథకాల అమలు వివరాలు స్పష్టంగా ఉన్నాయని ప్రశంసించారు.
కేంద్ర పథకాలపై అవగాహన అవసరం – ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు సరైన అవగాహన లేదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. 20 పాయింట్స్ ప్రోగ్రాం అమలుపై రాష్ట్రవ్యాప్తంగా సమీక్షలు నిర్వహించడం ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేస్తున్నారని లంక దినకర్‌ను ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలు విధానాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని నిధులు, పథకాలు తీసుకురావాలని సూచించారు.
GSDP లో జిల్లా ప్రమాద స్థానంలో ఉంది – కలెక్టర్జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ GSDP లో జిల్లా ప్రమాద స్థాయిలో ఉందని, గ్రోత్ రేట్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
