డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ఉల్లంఘన కేసులో విజయనగరం కోర్టు తీర్పు
విజయనగరం, జూన్ 30 (జన కమలం వార్త): డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో విజయనగరం కోర్టు హోల్‌సేల్ మెడికల్ షాపు యజమానికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. రజిత ఒక ప్రకటనలో వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం, విజయనగరంలోని ఎస్కేపీ టెంపుల్ సమీపంలో ఉన్న మనోజ్ మెడికల్స్ హోల్‌సేల్ ఫార్మా సంస్థలో 2016లో అప్పటి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎన్. యుగంధర్ రావు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా “Physician Sample – Not For Sale” అని ముద్రించిన మందులను నిబంధనలకు విరుద్ధంగా స్టాక్‌లో ఉంచినట్లు గుర్తించారు.
దీంతో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన విజయనగరం మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు మంగళవారం (జూన్ 30, 2026) తీర్పు వెలువరించింది.
నేరం రుజువు కావడంతో మనోజ్ మెడికల్స్ యజమాని డి. పాండురంగకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణలో ప్రస్తుత డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆర్. లలిత ప్రభుత్వ తరఫున వాదనలు సమర్థవంతంగా వినిపించారు.
జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ప్రజలకు హెచ్చరిక చేస్తూ, “అమ్మకానికి కాదు” అని ముద్రించిన ఫిజీషియన్ శాంపిల్స్‌ను విక్రయించడం లేదా నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
