విశాఖ తూర్పు నియోజకవర్గంలో దేవాలయ పాలకమండళ్ల నియామకాల విషయంలో జనసేనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాకుండా, విశాఖ తూర్పు నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఐదు దేవాలయాలు ఉండగా, అన్ని ఆలయాలకు పాలకమండళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కచోట కూడా జనసేనకు ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. ముఖ్యంగా, మత్స్యకారుల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన కారకచేట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది సభ్యుల పాలకమండలిలో జనసేన నుండి ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు.
జనసేన నుండి కనీసం ముగ్గురికి అవకాశం ఉండాల్సి ఉన్నప్పటికీ, పూర్తిగా పక్కన పెట్టడం వల్ల జనసేన వీరమహిళలు, జనసైనికులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి పొరపాట్లు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయని, ప్రతిరోజూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా నామినేటెడ్ పదవుల్లో 30 శాతం రిజర్వేషన్ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, అవి నిజం కాకూడదనే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
జనసేన చేసిన త్యాగానికి సముచిత గౌరవం ఇచ్చినప్పుడే, రెట్టించిన ఉత్సాహంతో జనసైనికులు, వీరమహిళలు భవిష్యత్తులో కూటమి విజయానికి కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలన్నా, భవిష్యత్తులో వైసీపీ తిరిగి పుంజుకోకుండా ఉండాలన్నా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
ప్రతి నియోజకవర్గంలో జనసేన, బీజేపీ కార్యకర్తలకు రావాల్సిన వాటాను అందించి, నిజమైన అర్థంలో “కూటమి ధర్మాన్ని” కాపాడాలని పిలుపునిచ్చారు.
