నవంబర్ 05 ః ప్రజలు ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానిలో భాగంగానే వైద్య సేవలను యూనివర్శల్ డిజిటలైజ్డ్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు.
సీఎస్సార్ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ ను ఆయన బుధవారం పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ముందుగా యూనిట్ లోపల రోగులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని దానిలో భాగంగా అందరికీ ఉపయోగపడేలా రూ.25 లక్షలతో సార్వత్రిక ఇన్సూరెన్స్ కల్పించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
కుప్పంలో సంజీవని పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటలైజ్డ్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరొక 10 కొత్త సబ్ యూనిట్లను సమకూర్చగలిగామని మంత్రి వివరించారు.
ప్రమాదకర వ్యాధులున్న వారికి ఇక్కడ సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ డా. రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ డా. కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, సూపరింటెండెంట్ డా. ఐ.వాణి, ఆర్ఎంవో డా. శ్రీహరి, నెఫ్రాలజీ విభాగం ఇన్ఛార్జి హెచ్వోడీ డా. రత్నప్రభ, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
