Posted in

విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం

visakhapatnam-aviation-edu-city-gmr-mansas
visakhapatnam-aviation-edu-city-gmr-mansas

విశాఖపట్నం, డిసెంబర్ 16:
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మరో ముందడుగు పడింది. జీఎంఆర్–మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఏవియేషన్ ఎడ్యూ సిటీకి విశాఖ వేదికగా అంకురార్పణ జరిగింది. మంగళవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ–మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

ఈ సందర్భంగా గోవా గవర్నర్‌, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భూమిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉన్న సంస్థలు అవసరమని, ఆ దిశగా జీఎంఆర్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి గ్రామానికి సమీపంలో విమానాశ్రయం ఏర్పడటం గర్వకారణమన్నారు. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యూ సిటీ ద్వారా సమగ్ర ఎకోసిస్టమ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ పునరుద్ధరణలో మంత్రి లోకేష్ పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టమన్నారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి వేగం పెరిగిందని, పౌర విమానయాన రంగం రాష్ట్రానికి గర్వకారణంగా మారిందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయని, జూలైలో అధికారిక ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. విమానయాన రంగం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, భీమిలి కేంద్రంగా ప్రముఖ సంస్థలు రానున్నాయని చెప్పారు. జీఎంఆర్ అధినేత జీవన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు నిజమైన మహర్దశ ప్రారంభమైందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం అవసరమని చెప్పారు. భూములను ప్రజల కోసం అంకితం చేసిన అశోక్ గజపతి రాజు సేవాభావం ఆదర్శనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *