అమరావతి, సెప్టెంబర్ 15 – రాష్ట్రంలో యూరియా వినియోగం, రైతుల సమస్యలు, ఆక్వా రంగం, సెంటు పట్టా లబ్దిదారులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలి రోజు సమావేశంలో ఈ అంశాలపై సమీక్ష జరిగింది.సమావేశంలో ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాల అభివృద్ధిని సమీక్షించిన సీఎం, జీఎస్డీపీ పెంపునకు అన్ని రంగాల్లో సమగ్ర ప్రణాళిక అవసరమని సూచించారు.
వ్యవసాయంపై చర్చ సందర్భంగా యూరియా సరఫరా, వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు వివరించగా, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.
యూరియా అధిక వినియోగం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనే అంశంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో అధిక యూరియా వాడకం కారణంగా క్యాన్సర్ కేసులు పెరిగిన విషయాన్ని ఉదాహరణగా చూపుతూ, “ప్రస్తుతం మన రాష్ట్రం క్యాన్సర్ కేసుల్లో టాప్-5లో ఉంది. యూరియా వాడకం పెరిగితే టాప్-1 స్థానంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది” అని చంద్రబాబు హెచ్చరించారు.
రైతుల్లో యూరియా వాడకం తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, దీనిపై ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.పీఎం ప్రణామ్ పథకం కింద యూరియా వాడకం తగ్గించిన రైతులకు కేంద్రం బస్తాకు రూ.800 ప్రోత్సాహకాన్ని రాష్ట్రానికి ఇస్తుందని, కానీ అది రైతులకు చేరడం లేదని అధికారులు వివరించగా, “రాష్ట్రం కోసం కాదు… ఆ డబ్బు రైతులకే వెళ్లాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించాలని ఆదేశించారు.బలభద్రపురంపై ప్రత్యేక దృష్టిసమావేశంలో మంత్రి నాదెండ్ల బలభద్రపుర గ్రామంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్న అంశాన్ని ప్రస్తావించారు.
ఆ గ్రామంలో ఎరువులు, యూరియా వినియోగం అధికంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ, బలభద్రపురలో క్యాన్సర్ కేసులపై ప్రత్యేక అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందా అన్నది సవివరంగా పరిశీలించాలని సూచించారు.“రసాయన ఎరువుల అధిక వినియోగం కారణంగా మన మిరపను చైనా తిరస్కరించింది. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
