సెప్టెంబర్ – 13 : భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జి.ఎం.ఆర్ అధికారులు క్షేత్ర స్థాయి లో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటినీ కలియతిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. అనంతరం నిర్మాణం దశను పూర్తి చేసుకున్న రన్ వే ను సైతం పరిశీలించారు. ముందుగా నిర్ణయించుకున్న డి.పి.ఆర్ మేరకు నిర్మాణాలు సక్రమం గా జరుగుతున్నాయని, దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిలుస్తుంది అన్న ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు.

తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ అధికారులతో సమీక్ష సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పనులు ఎక్కడ వరకు జరుగుతున్నాయి.. ఏ దశలో ఉన్నాయి.. అన్న విషయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా తనకున్న సందేహాలను సైతం సమీక్షలో చెప్పి వాటి నుంచి వివరణ తీసుకున్నారు.
అలాగే విశాఖపట్నం సిటీ నుండి హైవేకు మెట్రో కారిడార్ నిర్మాణం చెయ్యడం చంద్రబాబు దూర దృష్టి కి నిదర్శనం అని అన్నారు. అది కూడా పూర్తయితే మరింత త్వరగా భోగాపురం కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. వీటితోపాటు భువనేశ్వర్ నుండి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల బీచ్ కారిడార్ కోసం కూడా శరవేగంగా స్పష్టమైన డిపిఆర్ తో ముందుకు వెళ్తున్నామని అది పూర్తయితే మరిన్ని బహుళ ప్రయోజనాలు చేరువవుతాయని స్పష్టం చేశారు. వీలున్నంత తీరానికి దగ్గరగా బీచ్ కారిడార్ నిర్మాణం అవుతుందని.. దీనికి డిపిఆర్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిందని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మూడు జిల్లాలకు వినియోగంతో పాటు ఉత్తరాంధ్రకు ఆయువుపట్టుగా నిలుస్తుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. దేశంలోనే ఎంత అందమైన ఏర్పాటు తాను ఎక్కడ చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు. చాలా చక్కగా నిర్మాణం జరుగుతోందని రామ్మోహన్ నాయుడు తన సంతృప్తిని వ్యక్తం చేశారు. జిఎంఆర్ సంస్థ కూడా స్థానికంగా చెందిన జిఎంఆర్ కు చెందినది కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. స్థానికంగా డ్రైనేజీ, కనెక్టివిటీ రోడ్లు విషయంలో ఫిర్యాదులు అందాయని స్థానిక నాయకత్వం అధికారులకు ఈ సమస్యపై ఇప్పటికే అవగాహన ఉందని.. వీలైనంత వేగంగా వాటిని కూడా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గతంలో సంవత్సరానికి 36 లక్షల కనెక్టివిటీ తో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండేదని.. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి దశ నిర్మాణం పూర్తి అయితే 60 లక్షల కనెక్టివిటీ ఒక సంవత్సరానికి సాధిస్తుందని స్పష్టం చేశారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 2024 జూన్ నాటికి నెలకు రెండు లక్షల 30 వేల మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళేవారని.. తానూ కేంద్ర మంత్రిగా భాధ్యతలు తీసుకున్న తరువాత తీసుకున్న ప్రత్యేక చొరవతో ప్రస్తుతం నెలకు రెండు లక్షల డబ్బై వేలమంది ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు. తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని శాభారిమలై కొచ్చికి ఒక సర్వీసును, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరువురు గవర్నర్లు కంభంపాటి, అశోక్ గజపతిల సూచనల మేరకు.. భువనేశ్వర్, గోవా లకు సైతం సర్వీసులను ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు.

భోగాపురం తాను కేంద్ర మంత్రిగా భాధ్యతలు తీసుకునే సమయానికి కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే పనుల పురోగతి ఉందని, ప్రస్తుతం ఎనభై ఆరు శాతం కు చేరుకుందని తెలిపారు. ఈ డిసెంబర్ కు వ్యాలిడేషన్ ఫ్లైట్ ను రన్ చెయ్యడం జరుగుతుందని స్పష్టం చేశారు. మూల పేట లో పోర్టు, భోగాపురం లో ఎయిర్ పోర్ట్, విశాఖపట్నం లో ఐటి విప్లవం ద్వారా భవిష్యత్ లో ఉత్తరాంధ్ర మరింత వృద్ధి సాధిస్తుందని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. నారా లోకేష్ ప్రత్య్యేక చొరవతో అభివృద్ధి మరింత వేగంగా సాగుతోందని స్పష్టం చేశారు.
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి విషయం లో సైతం నారా లోకేష్ చూపించిన తెగువ ప్రసంశనీయం అని, దాదాపు నలభై ఎనిమిది గంటలకు పైగా ఇదే అంశం పై పూర్తిగా సమీక్షను నిర్వహించి.. యాత్రికుల సమస్యను ఒడ్డుకు చేర్చారని తెలిపారు. వారికి సురక్షితంగా విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేసి క్షేమంగా చేర్చడంలో కేంద్ర మంత్రిగా తన పూర్తి తోడ్పాటును అందించానని తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో దేశ, విదేశాల్లో యాత్రికులు, తెలుగువాళ్ళు చిక్కుకున్న సమయంలో కూడా ఇదే తరహా స్పూర్తిని టిడిపి సర్కారు చూపించిందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మెన్ కర్రోతు బంగారురాజు, ఆర్డీవో డి.కీర్తి, డీఎస్పీ శ్రీనివాసరావు, జిఎంఆర్ సీఈవో కన్వర్ బీర్ సింగ్ కలరా, సిడిఓ కోటేశ్వరరావు, ప్రాజెక్ట్ హెడ్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
