Posted in

Vishakapatnam: నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు వేదిక‌గా నిల‌వ‌నున్న ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్

District collector Vishakapatnam
District collector Vishakapatnam

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు వేదిక‌గా నిల‌వ‌నున్న ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ యువ‌త‌కు అందుబాటులోకి వ‌చ్చింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌గిరి మ‌యూరి టెక్ పార్కు నుంచి బుధ‌వారం ప్ర‌ధాన హ‌బ్ తో పాటు విశాఖ కేంద్రంగా వీఎంఆర్డీఏ డెక్ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన స్పోక్ (స్వ‌తంత్ర‌) సెంట‌ర‌ను కూడా ప్రారంభించారు.

ఈ క్ర‌తువులో జిల్లాకు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు వేపాడ చిరంజీవిరావు, గ‌ణ‌బాబు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ పీలా శ్రీ‌నివాస‌రావు, ఏపీ గ్రోవ‌ర్స్, సీడ్స్ అండ్ ఆయ‌ల్ ఫెడ‌రేష‌న్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గండి బాబ్జీ, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, జిల్లాలోని విద్యావేత్త‌లు, పారిశ్రామికవేత్త‌లు భాగ‌స్వామ్య‌మ‌య్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టార్ట్ అప్స్ ప్ర‌ద‌ర్శ‌న స్టాళ్ల‌ను వారంతా ప‌రిశీలించారు. అనంతరం జ‌రిగిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు.*న‌ష్ట భ‌యాల‌ను దాటి ముందుకు రావాలి

ః విప్ వేపాడ చిరంజీవిరావు*భార‌తీయుల్లో న‌ష్ట భ‌యాల‌ను భ‌రించే శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంద‌ని, అందుకే మేధ‌, జ్ఞానం ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన మేర‌కు ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయామ‌ని ఎమ్మెల్సీ, ప్ర‌భుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు అన్నారు. న‌ష్ట భ‌యాల‌ను అధిగ‌మించి ముంద‌డుగు వేసిన‌ప్పుడే అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధించ‌గ‌మ‌ల‌మ‌ని పేర్కొన్నారు.

ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ యువ‌త‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని, దీని ద్వారా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ప్ర‌తి ఒక్క‌రూ ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. మ‌న దేశంలో యువ‌త అధిక సంఖ్య‌లో ఉన్నార‌ని, డెమోగ్రాఫిక్ డివిడెండ్ కూడా ఎక్కువుగా ఉందని అందువ‌ల్ల ప్ర‌పంచ‌మంతా ఇండియా వైపు చూస్తోంద‌ని పేర్కొన్నారు.

*విశాఖ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంది ః విప్ గ‌ణ‌బాబు*ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ స్పోక్ సెంట‌ర్ రాక‌తో విశాఖ‌ప‌ట్ట‌ణం బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని, ఒన్ ఫ్యామిలీ ఒన్ ఎంట్ర‌ప్రెన్యూర్ అనే ల‌క్ష్యం సాధ్య‌ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వ విప్, ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు పేర్కొన్నారు.

అంద‌మైన సువిశాల తీరంతో పాటు విశాఖలో అన్ని అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని అన్నారు. గ‌తంలో ఇక్క‌డ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ ఆశాజ‌న‌క ఫ‌లితాలు రాలేద‌ని, ఇప్పుడీ ఇన్నోవేష‌న్ హ‌బ్ ద్వారా ప్ర‌ధాన ల‌క్ష్యాలు నెర‌వేరుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు నాయుడు లాంటి విజ‌న్ ఉన్న నాయ‌కుడి వ‌ల్ల 90వ ద‌శ‌కంలో ఐటీ విప్ల‌వం వ‌చ్చిందని, ఇప్పుడు ఏఐ విప్ల‌వం రాబోతోంద‌ని పేర్కొన్నారు. ఈ స్పోక్ సెంట‌ర్ ద్వారా మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు క‌లుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

*రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశను చూపుతుంది ః ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావు*ర‌తన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశను చూపుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని ఉపకేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మైలురాయి అని, భవిష్యత్తు తరాలకు ఈ హబ్ మార్గదర్శకంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి వ‌ల్ల రాష్ట్రం ఎన్నో రంగాల్లో ముందంజ‌లో ఉంద‌ని, గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందబోతోంద‌ని అన్నారు.

విశాఖపట్నంలో ప్రారంభమైన ఉప కేంద్రం కొత్త అవకాశాలను క‌ల్పిస్తుంద‌ని, త్వరలోనే అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

*ఉత్త‌రాంధ్ర పురోగ‌తికి గేమ్ ఛేంజ‌ర్ కానుంది ః జిల్లా క‌లెక్ట‌ర్*విశాఖ‌ప‌ట్ట‌ణం కేంద్రంగా వీఎంఆర్డీఏ డెక్ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన స్పోక్ సెంట‌ర్ ఉత్త‌రాంధ్ర అభివృద్ధి, పురోగ‌తిలో ఒక గేమ్ ఛేంజ‌ర్ కానుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అభివర్ణించారు.

యువ‌త‌కు అద్భుత‌మైన‌ ఆలోచ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డ‌మే పెద్ద సాహ‌సంతో కూడిన ప్ర‌క్రియ‌, దాన్ని అధిగ‌మించేందుకు ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ త‌గిన ప్రోత్సాహం అందిస్తుంద‌న్నారు. అన్ని ర‌కాల సాంకేతిక అంశాలను స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు వీలుగా ఈ స్పోక్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌లో విద్యావేత్త‌ల‌ను, పారిశ్రామిక వేత్త‌ల‌ను, అధికారుల‌ను భాగ‌స్వామ్యం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

నాలెడ్జ్ పార్ట‌న‌ర్లుగా ఏయూ, గీతం యూనివ‌ర్శిటీ, ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ సంస్థ‌లు ఉంటాయ‌ని, ఇండస్ట్రియ‌ల్ పార్ట‌న‌ర్లుగా జీఎంఆర్, దివిస్, ఆర్సెల్లార్ మిట్ట‌ల్ సంస్థ‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. విశాఖ వేదిక‌గా ఏర్పడిన స్పోక్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌కు వీలుగా రవి ఈశ్వ‌ర‌పు సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, జేసీ క‌న్వీన‌ర్ గా ఉంటార‌ని తెలిపారు.

అలాగే 20 మంది స‌చివాల‌యం సిబ్బందిని కేటాయించామ‌ని పేర్కొన్నారు. ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ఫ్యాక్ట‌రీస్ విభాగాల నుంచి కూడా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామ‌ని, అనుమ‌తులు, రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ల్లో సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

అనంతరం వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, జేసీ కె. మయూర్ అశోక్ మాట్లాడారు. *ఎంఓయూలు చేసుకున్న ఎనిమిది సంస్థ‌లు*బుధ‌వారం వీఎంఆర్డీఏ డెక్ భ‌వ‌నంలో జ‌రిగిన‌ ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్.టి.ఐ.హెచ్.తో ఎనిమిది సంస్థ‌లు ఎంవోయూలు చేసుకున్నాయి. వాటిలో TiE వైజాగ్, డీప్‌టెక్ నైపుణ్య ఫౌండేషన్ (DTNF), టిహాన్ IIT హైదరాబాద్, ఆల్కోవ్ పార్టనర్స్ LLP, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ITAAP), అట్లాస్ కాన్సిలియో ప్రైవేట్ లిమిటెడ్, లయా గ్రీన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LGV), CII-యంగ్ ఇండియన్స్ (Yi) వైజాగ్ చాప్టర్ లు ఉన్నాయి.

భ‌విష్య‌త్తు ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట్ అప్ ల‌ స‌మ‌గ్ర‌త‌, ప‌రస్ప‌ర‌ సహ‌కారం, స‌మ‌న్వ‌యం వంటి కోణాల్లో ఇవ‌న్నీ క‌లిసి ప‌ని చేయ‌నున్నాయి.

జీఎంఆర్ ప్ర‌తినిధి టాటాతేజ, దివిస్ ల్యాబ్స్ నుంచి డాక్టర్ సురేష్, ఆర్సెల్లార్ మిట్ట‌ల్ నుంచి ఎం.రవీంద్రనాథ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ధనుంజ‌య‌రావు, గీతం నుంచి డా. రాజాపప్పు, IIPE నుంచి డా. విజయ్ జ్ఞాన, ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *