విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సందర్శన జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం శాసనసభలో జరుగుతున్న సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించి చట్టసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, శాసన ప్రక్రియ, ప్రజాస్వామ్య పాలనా విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు.
శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పుస్తకాల ద్వారా తెలుసుకున్న చట్టసభ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం తమ విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
యువతకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు రాజకీయ, శాసన ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిచయం చేయడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు విద్యాసంస్థలకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య సంస్థల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రేమానందం, అధ్యాపకులు నాగరాజు, సత్యనారాయణతో పాటు ఇతర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం
