Posted in

నవధాన్యాల సాగుతో భూమి సారం పెరుగుతుంది – రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచనలు

District Collector Vizianagaram
District Collector Vizianagaram

విజయనగరం, జూలై 10: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు భూమి సారాన్ని పెంపొందించేందుకు నవధాన్యాల సాగు రైతులకు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం గుర్ల మండలం జమ్ముపేట గ్రామంలో నవధాన్యాల సాగును జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు విధానాలు, భూమి సారం పెంపు, పంటల ప్రయోజనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నవధాన్యాల సాగులో గతంలో 9 రకాల విత్తనాలు, అనంతరం 18 రకాల విత్తనాలు, ప్రస్తుతం 30 రకాల విత్తనాల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరానికి సుమారు 15 కిలోల విత్తనాలు అవసరమవుతాయని పేర్కొన్నారు.

విత్తనాలు వేసిన 40 రోజుల తర్వాత భూమిని దున్నడం ద్వారా పచ్చిరొట్ట ఎరువుగా మారి భూమి సారం పెరుగుతుందని, నేల గుల్లబారి వానపాముల సంఖ్య పెరగడంతో పాటు నేలలో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. దీని వల్ల సేంద్రియ వ్యవసాయానికి బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పారు.

వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటలను సమన్వయంతో సాగు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు.

సేంద్రియ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహిస్తూ, భూమి ఆరోగ్యాన్ని కాపాడే చర్యలను ప్రతి రైతు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ దిశగా వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖలు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి కె. చిట్టిబాబు, ఉద్యానశాఖ అధికారి ఎం. అనూష, వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, ఉద్యానశాఖ అధికారులు వి.హెచ్.ఏ. రామకృష్ణ, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రగతిశీల రైతులు కురుమునెల్లి బంగారు నాయుడు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *