Posted in

ఎంఆర్పీకి మించి యూరియా విక్రయం, ట్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ ఎస్. సేధు మాధవన్

Vizianagaram
Vizianagaram

విజయనగరం, జూలై 10: జిల్లాలో యూరియా పంపిణీపై రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IVRS (Interactive Voice Response System) ద్వారా వచ్చిన ప్రతికూల స్పందనల నేపథ్యంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులు, చిల్లర విక్రయదారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (MRP) కంటే అధిక ధరలకు యూరియాను విక్రయించడం, యూరియా కొనుగోలుకు ఇతర ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగుమందులు లేదా ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.


ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1985 నిబంధనల ప్రకారం యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీకే విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాగింగ్ లేదా లింకింగ్ చేయరాదని డీలర్లకు ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1985తో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రైతులకు నిబంధనల మేరకు ఎరువుల విక్రయం జరుగుతున్నదీ లేనిదీ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు, చిల్లర విక్రయదారులు పాల్గొన్నారు.

r

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *