విశాఖపట్నం, జూన్ 30: జిందాల్ ప్రాజెక్టు ప్రభావిత రైతుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విశాఖపట్నంలోని రాష్ట్ర హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ళ లలిత కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఇతర ప్రజాప్రతినిధులు, జిందాల్ కంపెనీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, జిందాల్ ప్రాజెక్టు ప్రభావిత రైతులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్ అంశాలు, పరిహారం, ఉపాధి, భూ హక్కులు వంటి కీలక విషయాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ఇప్పటివరకు షేర్ అమౌంట్ అందని 82 మంది రైతులకు షేర్ అమౌంట్ విడుదల చేయాలని నిర్ణయించారు.
జిందాల్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించేందుకు అంగీకరించారు.
ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు బంధవలస గ్రామంలో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు.
భూములు కోల్పోయిన రైతులకు అదనంగా ఎకరాకు రూ.2.50 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
చీడిపాలెం గ్రామంలో జాబితాలో పేర్లు లేని ఐదుగురికి పరిహారం మంజూరు చేసే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
18 మంది రైతుల పి.ఓ.టి. అంశాలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా పునఃపరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మూలబుడ్డవరం గ్రామంలోని ప్రభుత్వ భూముల విషయంలో అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అనంతరం అర్హులకు డి-పట్టాలు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు.
రైతుల్లో సంతృప్తి
ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో సమావేశంలో పాల్గొన్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు
తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులకు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు త్వరగా అమలులోకి రావాలని వారు ఆకాంక్షించారు.
