విజయనగరం, జూన్ 9:
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిందాల్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల రైతులు, నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఎస్పీ, రెవెన్యూ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిందాల్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అనిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ పరిహారం, ఉపాధి అవకాశాలు, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వినడానికే కాకుండా వాటికి పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బాధిత రైతులు, నిర్వాసితుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమావేశంలో పలువురు రైతులు తమ సమస్యలను నేరుగా వివరించగా, వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, లోకం మాధవి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఎస్పీ ఏ ఆర్ దామోదర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జనసేన నాయకుడు వబ్బిన సత్యనారాయణ,జెసి సేతు మాధవ్, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో సుధాసాగర్ తదితరులు పాల్గొన్నారు
