Posted in

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా రైతులకు భరోసా – మంత్రి అనిత

Home Minister Vangalapudi Anitha
Home Minister Vangalapudi Anitha

వేపాడ, జూన్ 08:రైతుల భూ హక్కులను మరింత పటిష్ఠం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం మంత్రి, విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ రీ-సర్వే పేరుతో 70 శాతానికి పైగా తప్పులతో పాస్ పుస్తకాలు తయారై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె విమర్శించారు. వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని వేపాడ మండలం బల్లంకి గ్రామంలో గురువారం నిర్వహించిన భూ హక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ భూమిపై సంపూర్ణ, శాశ్వత హక్కులను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.

అధికారిక రాజముద్రతో కూడిన పాసుపుస్తకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలకు తమ భూమితో విడదీయరాని అనుబంధం ఉంటుందని, ఆ భావోద్వేగాన్ని ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా లేదా పథకాలు అందకపోయినా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక హెల్ప్‌లైన్ వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక క్యూ ఆర్ కోడ్ సాంకేతికతతో కూడిన, అన్ని భూ వివరాలు పొందుపరిచిన తప్పులులేని పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 519 రెవెన్యూ గ్రామాల్లో రీ-సర్వే పూర్తి కాగా, మరో 464 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉందన్నారు. జూలై చివరి నాటికి జాయింట్ ఎల్పీఎంల విభజన పూర్తి చేసి భూ హక్కులను స్పష్టం చేస్తామని హామీ ఇచ్చారు.

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత పటిష్ఠంగా రీ-సర్వే నిర్వహించి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రైవాడ, తాటిపూడి జలాలను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వబ్బిన సత్యనారాయణ, టీడిపీ నేత కోళ్ళ రాంప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, దాసరి కార్పొరేషన్ చైర్మన్ రత్నాజీ, ఆర్డీవో సుధాసాగర్, వేపాడ మండల స్పెషల్ ఆఫీసర్ పి.ఎన్.వి. లక్ష్మీనారాయణ, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ, ఎంపిటిసి జి. తులసి, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.లబ్ధిదారుడు గుమ్మడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాస్ పుస్తకాల కోసం రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకం అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *