Posted in

పెద్ది సినిమా పై గిరిజన సంఘం ఫైర్

Peddi movie
Peddi movie

విజయనగరం, జూన్ 8:
ప్రముఖ తెలుగు చిత్రం “పెద్ది”లో గిరిజనులను వారి కులం పేరుతో కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయంటూ జనసేన పార్టీ నాయకుడు, గిరిజన సంఘం నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చిత్రీకరణ జరిగిందని ఆరోపిస్తూ, ఈ అంశంపై కేంద్ర సెన్సార్ బోర్డు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం

కల్పించిందన్నారు. అయితే కొన్ని చిత్రాల్లో వినోదం పేరుతో సామాజిక వర్గాలను అవమానించే ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని వక్రీకరించేలా లేదా కించపరిచేలా ఎలాంటి చిత్రీకరణ జరిగినా అది సమాజంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
గిరిజనులు దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటూ తమ ప్రత్యేక సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని, అలాంటి సమాజాన్ని అవమానించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. సినిమా నిర్మాతలు, దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
సినిమాల్లో ఏదైనా వర్గం మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఉంటే వాటిని సరిదిద్దే బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందని తుమ్మి అప్పలరాజు దొర అన్నారు. పెద్ది సినిమాలో వివాదాస్పదంగా భావిస్తున్న సన్నివేశాలపై సమగ్రంగా పరిశీలన జరిపి అవసరమైతే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గిరిజన సంఘాల ప్రతినిధులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, గిరిజనుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు, సన్నివేశాలు ఉన్నా వాటిని అంగీకరించబోమని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఈ అంశంపై చర్చ ప్రారంభమవడంతో గిరిజన సంఘాలు, పలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *