విజయనగరం, జూన్ 02 ః జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి ఆయన ఆర్డీవోలు, తాసిల్దార్లతో విస్తృతంగా చర్చించారు. నిర్దేశిత గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు భూములను అప్పగించాలని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ప్రభుత్వ మరియు పారిశ్రామిక అవసరాల కోసం జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 100 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములను ముందస్తుగా గుర్తించి సిద్ధంగా ఉంచాలని తాసిల్దార్లకు సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు కోల్పోతున్న స్థానిక రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని, ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతిపాదిత మరియు ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు కీలక ప్రాజెక్టుల భూ అవసరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై చర్చించారు. బయో-న్యూట్రిషన్ ఫుడ్స్ మరియు ప్రిసిషన్ ఫెర్‌షిషన్ ఫెర్‌మెంటేషన్ రంగంలో రూ. 1,440 కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిపాదించిన ఉమెనోవా ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2,500 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు 160 ఎకరాల భూమి అవసరం కాగా, సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కొండకిండాం ప్రాంతాన్ని సందర్శించారు. అయితే, ప్రాజెక్టు స్థాపనకు పక్క గ్రామంలో అదనపు భూమి కావాలని వారు కోరడంతో, ఆ మేరకు భూసేకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మామిడి, పనస పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 50 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చిన సన్‌రైజ్ నేచర్ ఫుడ్స్ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. భోగాపురం మండలం కొంగవానిపాలెం గ్రామంలోని 20 ఎకరాల అసైన్డ్ భూములను ఈ ప్రాజెక్టుకు కేటాయించాలని నిర్వాహకులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, సదరు భూముల కేటాయింపుపై తక్షణమే సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించాలని భోగాపురం తాసిల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
అలాగే రూ. 150 కోట్ల అంచనా వ్యయం, 250 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 25-30 ఎకరాల భూమిని కోరిన ఇండియన్ ప్రైమ్ కాఫీ ప్రతినిధులు ఏపీఐఐసీ (APIIC) పరిధిలోని బొండపల్లి మండలం కొండకిండాం సైట్‌ను సందర్శించినప్పటికీ, అక్కడ ప్రాజెక్టు స్థాపనకు వారు సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రత్యామ్నాయ భూములను పరిశీలించాలని ఆయన సూచించారు.
జిల్లాలో ఏపీఐఐసీకి అప్పగించిన, ప్రతిపాదించిన ఇతర భూముల పురోగతిని కూడా ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. విజయనగరం మండలంలోని కొండకిండాంలో ఏపీఐఐసీకి కేటాయించిన 12 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించారు. ఇది జాతీయ రహదారి 16 కి సుమారు 16 కిలోమీటర్లు, భోగాపురం విమానాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండల పరిధిలోని గుల్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కు కోసం 20 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోనే మరో 300 ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. రాజాం మండలం గారచీపురుపల్లిలో 31.68 ఎకరాల భూమిని గుర్తించి, ఏపీఐఐసీ నుండి భూసేకరణ అభ్యర్థనను స్వీకరించారు.
చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గరివిడి మండలం కాపుసంభం, బి.జి.పాలెం గ్రామాల పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం 26.71 ఎకరాల భూమిని వారం రోజుల్లోగా సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం ఆకులకట్ట వద్ద 210 ఎకరాల్లో మెగా ఫుడ్ ప్రాజెక్ట్, కొత్తవలసలో పతంజలి ఇండస్ట్రియల్ పార్క్, జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్, కొత్తవలస ఇన్‌ఫ్రావెంచర్, భోగాపురం మండలం పోలిపల్లి వద్ద డేటా సెంటర్ భూసేకరణపైనా చర్చించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ భూసేకరణలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా పారదర్శకంగా, వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు సుధాసాగర్, మోహనరావు, ఎస్‌డిసి అరుణకుమారి, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ వి.కృష్ణప్రసాద్, సంబంధిత మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు.
