వ్యవసాయానికి అండగా… గ్రామాభివృద్ధికి బాటగా…
విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామంలోని గాడు వాని చెరువు జలధార పనులతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఎన్నో సంవత్సరాలుగా పూడికతో నిండిపోయి నిల్వ సామర్థ్యం కోల్పోయిన ఈ చెరువు, ప్రస్తుతం జరుగుతున్న పూడికతీత, తుప్పల తొలగింపు, గట్టు బలోపేత పనులతో మళ్లీ జీవం పొందుతోంది.
ఈ పనుల్లో సుమారు 150 మంది కూలీలు ఉపాధి పొందుతూ గ్రామంలోనే ఆదాయం సంపాదిస్తున్నారు. దీంతో గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వలసల నివారణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పూర్తయిన అనంతరం 30.47 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే సామర్థ్యాన్ని సంతరించుకోనుంది. చెరువులో నుంచి తీసిన మట్టితో గట్టును బలోపేతం చేయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ఈ చెరువు పునరుద్ధరణతో మోదవలస గ్రామానికి చెందిన 18 మంది రైతు కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. వరి పంటతో పాటు ఇతర పంటల సాగుకు కూడా అవకాశాలు విస్తరించి, రైతుల ఆదాయం పెరిగే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
జలధార కేవలం చెరువుల అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు… గ్రామీణ జీవనోపాధికి బలమైన ఆధారం. చెరువులు నిండితే పొలాలు పచ్చబడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
గాడు వాని చెరువు కూడా అదే దిశగా సాగుతూ, మోదవలస గ్రామ వ్యవసాయాభివృద్ధికి బలమైన పునాదిగా మారుతోంది.
