జన కమలం గ్రౌండ్ రిపోర్ట్ – పి. సురేష్
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో తాటిపూడి–విజయనగరం 516 జాతీయ రహదారి సమీపంలో అభివృద్ధి చేస్తున్న స్వప్న లోక్ రియల్ ఎస్టేట్ వెంచర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వ చెరువు భూములను ఆక్రమించి రోడ్డు నిర్మించారనే ఆరోపణలతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు పరిశీలన చేపట్టి, ప్రభుత్వ చెరువులకు సంబంధించిన భూముల్లో ఆక్రమణలు జరిగినట్లు అనుమానిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డుల ప్రకారం సర్వే నెం.56లోని “పెద్ద బండ” చెరువు మరియు సర్వే నెం.99-1లోని “జగన్నాథ బండ” చెరువు ప్రభుత్వ భూములుగా గుర్తించబడ్డాయి.
బోర్డులపై “ఆక్రమణ చేయరాదు – ఆక్రమణ చేసినచో శిక్షార్హులు” అని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అయితే అధికారులు ఏర్పాటు చేసిన ఈ హెచ్చరిక బోర్డులు మరుసటి రోజుకే కనిపించకుండా పోవడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
బోర్డులు మాయం.. ఎవరి చర్య?
ప్రభుత్వ భూములను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు రాత్రికి రాత్రే మాయం కావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రైతులు, ప్రజలు మాత్రం దీనిని ప్రభుత్వ అధికారుల చర్యలకు సవాలుగా అభివర్ణిస్తున్నారు.
రెవెన్యూ అధికారులు భూమిని ప్రభుత్వ చెరువు భూమిగా గుర్తించిన తరువాత కూడా బోర్డులు తొలగించబడటం వెనుక ఉన్న కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన వెంచర్
స్థానికుల కథనం ప్రకారం ఈ స్వప్న లోక్ వెంచర్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. అప్పట్లో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు కౌశిక్ ఆధ్వర్యంలో వెంచర్ అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు.
ఆ సమయంలో కూడా చెరువు భూములపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గత ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తహసీల్దార్ హెచ్చరిక
ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో స్థానిక రైతులు మరోసారి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. చెరువు భూముల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణలు చేయరాదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్, హెచ్చరిక బోర్డులు తొలగించినా చట్టపరమైన చర్యలు ఆగవని స్పష్టం చేసినట్లు సమాచారం. చెరువు భూమిపై అక్రమంగా రోడ్డు నిర్మించినట్లు తేలితే అవసరమైతే ఆ రహదారిని తొలగించే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కొనుగోలుదారులు చలో ఆందోళన
స్వప్న లోక్ వెంచర్లో స్థలాలు కొనుగోలు చేసిన వారిలో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. చెరువు భూముల వివాదం ఎటు దారితీస్తుందో, రహదారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో లేఅవుట్ అనుమతులు, రహదారి వినియోగం, స్థలాల విలువలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తదుపరి చర్యలపై ఉత్కంఠ
సర్వే నెం.56లోని పెద్ద బండ చెరువు, సర్వే నెం.99-1లోని జగన్నాథ బండ చెరువు భూములపై వచ్చిన ఆక్రమణ ఆరోపణలు, రెవెన్యూ హెచ్చరిక బోర్డుల మాయం, అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ చెరువుల పరిరక్షణలో అధికారులు ఎంత వరకు కఠిన చర్యలు తీసుకుంటారు? ఆక్రమణలు నిజమని తేలితే రోడ్డు తొలగిస్తారా? బోర్డులు తొలగించిన వారిపై చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.
