విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, మిడ్ డే మీల్స్ పథకం అమలు జరుగుతున్న పాఠశాలలు, హాస్టళ్లలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల లోపాలు గుర్తించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం (0316020) ను తనిఖీ చేసిన సందర్భంగా పిల్లల హాజరు పట్టికలో నమోదు లేకపోవడం, స్టాక్ రిజిస్టర్‌లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత టీచర్‌పై మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
వరలక్ష్మి నగర్‌లోని రేషన్ డిపో నంబర్ (0386151) లో అనధికారంగా సబ్బులు, షాంపూలు విక్రయించడం, స్టాక్ బోర్డులో వివరాలు లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ షాప్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాపయ్య రాజుపాలెం రేషన్ షాప్ (0386419) లో అధికారిక బోర్డు లేకపోవడం, స్టాక్ వివరాలు ప్రదర్శించకపోవడం గమనించి మెమో జారీ చేయాలని ఆదేశించారు.
గొల్లవానిపాలెం ఎంపీపీ స్కూల్‌లో 40 గుడ్లు అదనంగా ఉండటంపై హెడ్మాస్టర్‌ను ప్రశ్నించారు. చిన్న ముషిడిలోని అంగన్వాడీ కేంద్రం (0316008) లో పిల్లల హాజరు, గుడ్ల స్టాక్ రికార్డుల్లో తీవ్రమైన తప్పులు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్, పెందుర్తిలో మిడ్ డే మీల్స్ నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. మేఘాద్రిగడ్డ అంబేద్కర్ గురుకులాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేసిన కాంతారావు, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
