Posted in

పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభం – ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్

Nellimarla MLA
Nellimarla MLA

విజయనగరం, ఏప్రిల్ 07:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత సౌర విద్యుత్ అందించే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఎస్సీ కాలనీలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ మరియు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సౌర ప్లాంట్లు లబ్ధిదారులు సిహెచ్. రాంబాబు మరియు సిహెచ్. లక్ష్మణ గృహాలలో ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు వినియోగదారులకు విద్యుత్ బిల్లులలో గణనీయమైన ఆదా కలిగిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.75,021 కోట్ల సబ్సిడీ కేటాయించినట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ (ULA) విధానంలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా 2 కిలోవాట్ల సౌర రూఫ్‌టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లాలో మొత్తం 50,946 ఎస్సీ, ఎస్టీ వినియోగదారులలో మొదటి విడతగా 15,018 మందికి రూ.170.48 కోట్ల వ్యయంతో 30.04 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, జగ్జీవన్ జ్యోతి యోజన ద్వారా ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 5089 మంది వినియోగదారులలో 1443 మందికి రూ.16.29 కోట్ల రాయితీతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *