విశాఖపట్నం, జనవరి 03 (జన కమలం న్యూస్):విశాఖపట్నం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) అమలులో ఎలాంటి లోపాలు ఉండరాదని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జనవరి నెలకు సంబంధించిన చెక్కిగోధుమ పిండి (అట్టా) పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సరుకులను సమయానికి లిఫ్టింగ్ చేసి, రేషన్ కార్డుదారులకు న్యాయబద్ధంగా, సక్రమంగా పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. పి.డి.ఎస్ సరుకుల పంపిణీలో ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రేషన్ కార్డుదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సరుకుల రవాణా సమయంలో చెక్‌పోస్టుల నిర్వహణను క్రమబద్ధంగా చేపట్టి, అక్రమ తరలింపులకు అవకాశం లేకుండా పర్యవేక్షణ పెంచాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు, డిప్యూటీ మేనేజర్ శ్రీలత, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్లు (ఏఎస్‌వోలు), చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు, మండల స్థాయి గోదాం ఇన్‌చార్జీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
