Posted in

రూ.12.60 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

Helth Minister
Helth Minister

జన కమలం వార్త
శృంగవరపుకోట | ఫిబ్రవరి 2, 2026 :
రాష్ట్రంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
సోమవారం శృంగవరపుకోట పట్టణంలో రూ.12.60 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ వైద్యశాలను, అలాగే రూ.1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలితకుమారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ కేంద్రం ద్వారా మూత్రపిండాల రోగులకు కీలక సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు కూటమి ప్రభుత్వంలో మరింత మెరుగవుతాయని, స్థానిక ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గతంలో 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ఆసుపత్రిని ప్రాంతీయ ఆసుపత్రిగా మార్చామని, అంచెలంచెలుగా పేద ప్రజల కోసం అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుతం అసంతృప్తికరంగా ఉన్న 100 పడకల ఆసుపత్రికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఎస్.కోటతో పాటు అరకు, గజపతినగరం నియోజకవర్గాల ప్రజలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని చెప్పారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ వైద్యశాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల ఇకపై ప్రజలు విజయనగరం లేదా విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. మహిళలు, వృద్ధులు, పేదలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కృషి వల్లే ఈ కేంద్రం సాధ్యమైందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ కీర్తి, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, బీజేపీ నాయకులు రాజేష్ వర్మ, రెడ్డి పావని, వివిధ మండల, రాష్ట్ర నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *