Posted in

కేంద్రం కట్టుదిట్టమైన పరిశీలన – పీఎం కిసాన్ నుంచి 35 లక్షల మంది తొలగింపు

PM kisan scheme
PM kisan scheme

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి, వారి పేర్లను తాత్కాలికంగా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. పథకానికి పెరుగుతున్న ఆర్థిక భారం, లబ్ధిదారుల డేటాలో అక్రమాలు, పునరావృత లబ్ధి వంటి అంశాల దృష్ట్యా ఈ చర్య చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అనర్హతకు ప్రధాన కారణాలు

మూడు రకాల కేసులను ప్రభుత్వం గుర్తించింది—

ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పీఎం కిసాన్ నిధులు పొందడం

2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసినవారు పథకం కింద లబ్ధి పొందడం

పాత యజమాని–క్రొత్త యజమాని ఇద్దరూ ఒకే భూమిపై ఒకేసారి లబ్ది పొందడం

ఈ విభాగాల్లో నమోదైన కేసులను పరిశీలించిన తర్వాత, మార్గదర్శకాల ప్రకారం అర్హత లేదని తేలిన రైతుల లబ్ధిని ప్రభుత్వం నిలిపివేసింది

రైతులు తన పేరును ఎలా చెక్ చేసుకోవాలి?

రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక pmkisan.gov.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోని “Know Your Status” విభాగాన్ని చూడవచ్చు.
పేరు తొలగించబడినట్లయితే, అవసరమైన పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తై అర్హులని నిర్ధారించిన తర్వాత మళ్లీ లబ్ధిదారుల జాబితాలో చేర్పు జరుగుతుంది.

21వ విడత నిధుల ముందు పరిశీలన పూర్తి

పథకంలోని 21వ విడత నిధులు విడుదలకు ముందు ఈ పరిశీలన ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 10 కోట్ల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో, పథకంపై పడుతున్న భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూరాలన్నదే పథకం లక్ష్యమని, అయితే అర్హులైన వారికి మాత్రమే సాయం అందేలా కఠినతర విచారణ కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *