11 డొమెస్టిక్, 98 లోకల్ సిలిండర్లు స్వాధీనం
జన కమలం వార్త / విశాఖపట్నం
తేదీ: 30-01-2026
జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశముల మేరకు విశాఖపట్నం నగరంలోని పూర్ణా మార్కెట్ ప్రాంతంలో పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను సర్కిల్–1 ఏ.ఎస్.ఓ. గారు మరియు సిబ్బంది చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా చేపట్టారు.
తనిఖీలలో భాగంగా ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్స్ నుండి సేకరించి, వాటిలోని LPG గ్యాస్‌ను రెగ్యులేటర్లు, గొట్టాల సహాయంతో నాణ్యత లేని చౌకబారు లోకల్ సిలిండర్లలోకి నింపి అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపార ప్రాంగణాలను అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు
లవ్లీ గ్యాస్ స్టవ్ రిపేర్స్,
వైజాగ్ ట్రెండ్స్ మెన్స్ వేర్ క్లాత్ స్టోర్స్,
ఇక్బాల్ ఫ్యాన్సీ స్టోర్స్
అనే వ్యాపార సంస్థలు గుర్తించబడినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజా భద్రత దృష్ట్యా ఈ తనిఖీలలో మొత్తం
11 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు,
98 నాణ్యత లేని లోకల్ గ్యాస్ సిలిండర్లు,
4 నాన్-డొమెస్టిక్ 5 కేజీల BPCL సిలిండర్లు,
2 నాన్-డొమెస్టిక్ 5 కేజీల HPCL సిలిండర్లు
స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గ్యాస్ సిలిండర్లను టౌన్ కొత్త రోడ్‌లోని HPCL రామచంద్ర గ్యాస్ ఏజెన్సీ వారికి తగిన భద్రత చర్యల నిమిత్తం అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి LPG గ్యాస్‌ను నాణ్యత లేని లోకల్ సిలిండర్లలోకి నింపడం చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన చర్యగా పరిగణించబడుతుందని అధికారులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చర్యల వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత వ్యాపార ప్రాంగణాలపై నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం సెక్షన్ 6-ఏ కింద కేసులు నమోదు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
