Posted in

ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడకండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

AP Deputy CM Pavan Kalyan
AP Deputy CM Pavan Kalyan

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్న ఈ తరుణంలో కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విభేదాలు రేపే కుట్రలకు పాల్పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ముసుగులో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

“చట్టపరంగానే ముందుకు వెళ్ళాలి”

ప్రజలను రెచ్చగొట్టేలా అభ్యంతరకరంగా మాట్లాడేవారి పట్ల, అలాగే వారి వెనక ఉన్న కుట్రదారులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావిస్తే, కుట్రదారులకే లాభం జరుగుతుంది. సమస్యను జటిలం చేయకుండా, కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి” అని ఆయన సూచించారు.

మచిలీపట్నం ఘటనపై విచారణ

మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ జరపాలని ఇప్పటికే నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

“ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రతిఘటన”

కుట్రలకు పాల్పడే వారిని, సామాజిక అశాంతి కలిగించే వారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా ఎదుర్కొనే దిశగా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “వారి దుష్ప్రచారాన్ని శాంతియుత మార్గంలో తిప్పికొడదాం. కులాలు, మతాల మధ్య విభేదాలు రేపే వారిని చట్టం ముందు నిలబెట్టాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *