విజయనగరం, ఆగస్టు 23
జాతీయ న్యాయ సేవా సంస్థ, న్యూ ఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ మరియు విజయనగరం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మపురి గ్రామంలో SC, ST (POA) చట్టం పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం. భబిత గారు మాట్లాడుతూ “PCR Act, 1955 మరియు SC/ST (POA) Act, 1989 భారతీయ చట్టాలలో కీలకమైన రెండు భాగాలు. ఈ చట్టాలు షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరుగుతున్న వివక్ష, హింసలను అరికట్టేందుకు, వారి హక్కులను రక్షించేందుకు అమలులోకి వచ్చాయి” అని తెలిపారు.
ఆమె మరింతగా మాట్లాడుతూ – “SC/ST (POA) చట్టం కేవలం భౌతిక దాడులు కాకుండా, సామాజిక బహిష్కరణలు, ఆర్థిక దోపిడీ వంటి అనేక రకాల దురాగతాలను కవర్ చేస్తుంది. బాధితులకు తక్షణ ఉపశమనము, పునరావాసం కల్పించడమే కాకుండా, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. మరోవైపు PCR చట్టం అంటరానితనం నిర్మూలనపై దృష్టి పెడుతుంది. ఈ రెండు చట్టాలు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని వివరించారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీ ఏ. కృష్ణ ప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్ శ్రీ స్వర్ణ కుమార్, రెవెన్యూ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
