Posted in

Vishakapatnam: విశాఖలో ఘనంగా నిర్వహించిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

Prakasam pantulu jayanti
Prakasam pantulu jayanti

విశాఖపట్నం, ఆగస్టు 23: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, “ఆంధ్రా కేసరి”గా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం ఉపసంచాలకులు కె. సదారావు, సహాయ సంచాలకులు దున్న రమేష్, సెట్విస్ సీఈవో పి.వి.ఎన్. సత్యనారాయణతో కలిసి ఆంధ్ర కేసరి చిత్రపటానికి పూలమాలలంకరణ చేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపసంచాలకులు కె. సదారావు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం, స్వాతంత్ర్య సమరంలో ఆయన పోరాటం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన తపన ఈ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా కలెక్టరేట్‌లో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. మీటింగు హాలులో ఏర్పాటు చేసిన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్. భవానీ శంకర్, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశ స్వాతంత్ర్య సాధనలో ఆయన కృషిని, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చూపిన పరిపాలనా దక్షతను గుర్తు చేసుకున్నారు. ఆయన సమాజానికి అందించిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమాలలో డివిజనల్ పిఆర్ఓ డి. నారాయణరావు, సెట్విస్ సూపరింటెండెంట్ సుధాకర్, ఏపీఆర్ఓ శ్రీనివాసరావు, పిఆర్ఓ కిషోర్, ఏవీఎస్ కె. వెంకట్రావు, సమాచార శాఖ కార్యాలయ సిబ్బంది, సెట్విస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *