పిఠాపురం రాజకీయాల్లో జనసేన, వైసీపీ ములాఖాత్ అంటూ వర్మ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ మరియు జనసేన స్థానిక నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి.
పిఠాపురంలో టీడీపీ నేత వర్మ కారణంగా కూటమి లో విభేదాలు తలెత్తుతున్నాయని పార్టీ నేతలు ఆరోపపిస్తుంటే మరోవైపు, వర్మ వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టీడీపీ కేడర్ చేసిన త్యాగాలను పక్కన పెట్టి, వైసీపీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతోంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీ మధ్య ‘ములాఖత్’రాజకీయాలు జరుగుతున్నాయని జనసేన ఆరోపిస్తుండగా, పిఠాపురంలో మాత్రం జనసేన-వైసీపీ మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ను జనసేనలోకి తీసుకువచ్చి, స్థానికంగా పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా బలంగా నిలబడాలంటే, స్థానికంగా బలమైన నేతల మద్దతు అవసరమని భావించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనితో పెండెం దొరబాబు, వర్మ మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. టీడీపీ బలమైన కేడర్ చేజారిపోకుండా కాపాడుకోవడానికి వర్మ గట్టిగా పోరాటం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వివాదంపై మౌనం పాటించడం గమనార్హం. ఇద్దరూ తమ తమ రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే—వైసీపీ మహిళా నేత వంగా గీత పిఠాపురం రాజకీయాల్లో ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్ష స్థానాల్లో జనసేన, టీడీపీ పార్టీలు చురుకుగా ఉండగా, వైసీపీ ఉనికి తగ్గినట్టుగా పని చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే, పెండెం దొరబాబు ఎంట్రీతో పిఠాపురం రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. వైసీపీ క్యాడర్ తో జనసేన ములాఖత్ కావడంతో పిఠాపురం టీడీపీ పరిస్థితి ఏంటని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.
పిఠాపురంలో టీడీపీ వర్మ బలం ఎంత? వైసీపీ ,జనసేన కలిస్తే జనసేన బలమెంత అన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
